ఇరాన్‌తో ఉద్రిక్తతలు.. ట్రంప్‌ సంచలన ప్రకటన

  • ఇరాన్‌తో ఒప్పందం ముగిసినట్టేనన్న ట్రంప్‌
  • చర్చలు కొనసాగించడం సమయం వృథా అని వ్యాఖ్య
  • ఇరాన్‌పై అమెరికా భారీ ప్రతీకార దాడులు
  • చమురు విక్రయాల అనుమతి రద్దు
  • బహ్రెయిన్‌, కువైట్‌పై ఇరాన్‌ ఎదురుదాడులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ఇక ముగిసినట్టేనని సంచలన ప్రకటన చేశారు. ఆ దేశంతో చర్చలు కొనసాగించడం సమయం వృథా అంటూ మండిపడ్డారు. అయితే అమెరికా ప్రతినిధులు చర్చలు కొనసాగించాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని చెప్పారు.

హర్మూజ్‌ జలసంధిలో నౌకలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌, సిరిక్‌ పోర్టు నగరాలు, ఖెష్మ్‌ ద్వీపంలోని లక్ష్యాలపై విరుచుకుపడింది. అదే సమయంలో ఇరాన్‌ చమురు విక్రయాలకు ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేసింది. దీనికి ప్రతీకారంగా బహ్రెయిన్‌, కువైట్‌లపై ఇరాన్‌ దాడులు చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. ‘‘నా దృష్టిలో ఇరాన్‌తో చర్చలు ముగిసిపోయాయి. వారితో ఇక చర్చించాలని నాకు లేదు. వాళ్లతో చర్చలు జరపడం సమయం వృథా’’ అని పేర్కొన్నారు.

ఇరాన్‌ నాయకత్వంపై కూడా ట్రంప్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘వాళ్లు ప్రమాదకరమైన వ్యక్తులు. అణ్వాయుధాలు వారి చేతికి వస్తే కచ్చితంగా ఉపయోగిస్తారు. అందుకే నా దృష్టిలో చర్చలు ముగిసినట్టే’’ అని వ్యాఖ్యానించారు.

Donald Trump
Iran US Tensions
NATO Summit
Nuclear Weapons
Strait of Hormuz
Middle East Conflict

More Telugu News